Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page

దైవభక్తి - గురుభక్తి

ఈశ్వరుడు ఎట్లు నిర్వచించుట? ప్రతి మతమును భగవంతుని 'కర్త' యని పేర్కొనును. సృష్టిస్థితులకు ఆయన అధి కర్తయని చెప్పును. ప్రతి కార్యమునకును కారణ మొకటి యుండవలెను. సృష్టియు నొకకార్యమే. ఆకార్యఫలమే ఈ ప్రపంచము. ఈ సృష్టి కార్యమునకు మూలకారణ మొకటి యుండవలెను. అట్టి కారకుడే ఈశ్వరుడు. బ్రహ్మసూత్రములందు 'కర్తాశాస్త్రార్థతత్వాత్‌' అని చెప్పబడినది ఈశ్వరుడు కర్మఫలదాత యనియును నుడువుదురు. మంచియు చెడ్డయు రెండును ఆయననుండియే కల్గును.

ప్రతి మతమును, భగవద్భక్తి అవసరమని ఉద్ఘాటించును. ఎందుచేత? ఈశ్వరుడు సృష్టికర్త; కర్మఫలదాత. ఆయనచేసెడి ఈ రెండుకార్యములకును, ఆయనయందలి మన భక్తికిని ఏమిసంబంధము? సృష్టించుట కర్మఫలముల నిచ్చుట ఈ రెండింటినీ ఆయన స్వేచ్ఛగా చేయును. ప్రపంచమును సృష్టించుమని ఆయనను ఎవరును అడుగతేదు. మన కోరికపై గాక తన కోరికకొద్దీ ప్రపంచమును సృష్టించిన సృష్టికర్తకు - మనము కోరిన ఫలములను నీయక తన ఇష్టానుసారము ఫలములు నిచ్చెడి కర్మఫలదాతకు - మనమేల భక్తిని చూపవలెను?

నాస్తికునకు ఈ ప్రశ్న అసలు ఉదయించదు. అతడు కర్తనుగానీ, కల్మఫలదాతనుగానీ అంగీకరించడు. అతనిది వైదిక సంప్రదాయము కాదు. వైదిక సంప్రదాయములో వచ్చిన సాంఖ్యము సృష్టికర్తను ఒప్పుకొనదు. అందులో ఒక తెగ నిరీశ్వరసాంఖ్యము. పూర్వమీమాంసకులు దేవుని కర్మఫలదాతగ నంగీకరించరు. వారికి దేవునితో, పనిలేదు. ఇట్లు ఈ ఇరు తెగలవారికి దేవు డక్కరలేదు. సాంఖ్య మతాను సారము ప్రకృతియే విశ్వమునకు కారణము. 'అదృష్టముచే కర్మఫలము సంభవించు' నని పూర్వమీమాంస చెప్పును. పూర్వమీమాంసకులకు కర్మఫలముల నిచ్చుటకు ఒక భగవంతుడు కాబట్టడు.

ఈ వాదముల రెంటిని ఆదిశంకరులు ఖండించిరి. ప్రకృతి జడము. ప్రపంచమును జడమే. ఒక జడవస్తువు మరియొక జడ వస్తువునుండి పుట్టజాలదు. అందుచే చేతనమగు వస్తువే ప్రపంచమునకు మూలకారణముగా నుండవలెను. కర్మఫలముల నిచ్చుటకు సైతము ఒక చైతన్యమూర్తికి వీలగును కానీ, జడవస్తువునకు వీలుకాదు. సాధారణముగా జనులు, 'బౌద్ధమతమును శంకరులు ఖండించి' రని చెప్పుదురు. కాని వారు ముఖ్యముగా సాంఖ్య మీమాంసావాదములనే ఖండించిరి. బౌద్ధమతము బోధించిన వైదికకర్మ నిరాకరణమును, నిరీశ్వరత్వమును మీమాంసకులగు కుమారిలభట్టును తార్కికులగు ఉదయనా చార్యులును ఖండించిరి. నిజమునకు బౌద్ధమత ప్రతిపక్షులు వీరు.

సృష్టికర్తయు, ఫలదాతయు నగు ఈశ్వరు డొకడున్నాడని అంగీకరించిన యెడల ఆయనను పూజచేయ నవసరమేమి? దీనికి బదులు పతంజలి మహం
మనస్సు నేకాగ్ర మొనరించి యేదే నొక వస్తువును ధ్యానించిన ధ్యేయమగు ఆవస్తుగుణములు మనకు అలవడును. కట్టకడపట ఆవస్తువే మన మగుదుము. ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఆయనకు కోరికలేమియు లేవు. అందుచే ఆయన తన్ను ధ్యానించినవారిని తనవలెనే ఆశారహితులుగ చేయును. ఆచలముగ, ఈప్రపంచమున స్థాణువువలె మనముండగోరినచో స్థాణువగు ఈశ్వరునియందు మనము భక్తినుంచవలెను.

ప్రార్థన భక్తియందొక విభాగము. జనులు ఇది ఇమ్మని అది ఇమ్మని భగవంతుని ప్రార్థింతురు. ఒక ప్రయోజనమును ఉద్దేశించి ప్రార్థన ముండరాదు. కోరినదానిని దేవుని అడుగనేల? నీకోరిక ఏమిటో తెలియలేని, అజ్ఞానియా అతడు? అతడు సర్వజ్ఞుడుకదా! తనకడకు నీవు వచ్చెదవనియు, వచ్చి ప్రార్థింతువనియు ఆయన నీకై వేచియుండునా ? నీవు అడుగు నంతవరకు నీ కోరిక ఏమిటో ఆయనకు తెలియదనుట ఆయన సర్వజ్ఞత కొక కొరత, నీవు అడుగునంతవరకు నీకు వలసిన వస్తువును ఈయక జాగుచేయుచున్నాడనిని ఆయన దయ కొక కొరత.

తల్లి మీనాక్షిని సంబోధించుచు, శ్రీ నీలకంఠదీక్షితులిట్లు చెప్పును.

ఆవేద్యతా మవిదితం కి మథాప్యనుక్తం

వక్తవ్య మాంతర రుజోపశమాయ నాలమ్‌,

ఇత్యర్థసే కి మపి తచ్ఛ్రవణ నిధాతుం

మాతః ప్రసీద మలయధ్వజ పాండ్యకన్యే||

'అవిదితం ఆవేద్యతాం కిం' నీకు తెలియనిది నేను చెప్పబోవుచున్నానా ఏమి? 'అథాపి' కానీ, 'వక్తవ్యం అనుక్తం (చేత్‌) చెప్పవలసినది చెప్పకపోయినచో, అంతరరుజ ఉపశమాయ నాలం' అంతర్యముననున్న బాధ శమింపదు. 'ఇతి' అందుచే, 'కి మసి తత్‌ శ్రవణ నిధాతుం అర్థ్యసే' నేను చెప్పు దానిని కొంత చెవియొగ్గివినుము. 'మలయధ్వజ పాండ్యకన్యే!' ఓ మీనాక్షీ! నాయెడల ప్రసన్నవుకమ్ము.

అందువలన 'ప్రార్థనయొక్క ప్రయోజనమేమి?' అని ఎవరయిన ప్రశ్నించిన, 'చెవియొగ్గి విను దయాశీలియగు పరమేశ్వరునికి మన హృదయబాధలను తెలుపుటయు, తద్వారా కొంత బాధోపశమనము పొందుటయు'' అని చెప్పవలసి వచ్చును.

ప్రార్థన చేసినంతమాత్రమున మనము దేవుడు నిర్ణయించిన విధిని మార్చి వేసితిమని కాదు. నిజమునకు ఆయన విధిని ఏమానవుడును మార్చలేడు. మనము ప్రార్థించుట మనమనో మాలిన్యములను పోగొట్టుకొనుటకు, నిస్సంగత్వము అలవరచుకొనుటకు. 'సాంగత్యదోషము పోవలెనన్న నిస్సంగితో సంగిత్వమును పెంచుకొమ్ము' అని తిరువళ్ళువరు బోధించును. దేవుడొక నిస్సంగి. ఆయనతోడి సాంగత్య మభివృద్ధి అగుకొలది మన సాంగత్యదోషము లన్నియు, ఒక్కటొక్కటిగా జారిపోవును. దైవప్రార్థన క్రమమార్గమున చేసిన ఆయన తన సాంగత్యమును మనకు చేకూర్చి ప్రాపంచిక విషయములలో నిస్సంగత్వమును అలవాటుచేయును. విషయబద్ధమగు మనస్సును మరల్చి, చిత్తస్వాస్ధ్వము లభించునట్టు చేయును. అదియే చిత్తవృత్తి నిరోధము. అదియే యోగము. అట్టి యోగము భక్తిచేత లభించును.

మన సంప్రదాయమున ఈశ్వరుడును, గురువును ఒక్కడే.

యస్య దేవే పరాభక్తి ర్యథా దేవే తథా గురై,

తసై#్యతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః||

కానీ, దేవుడు చేయు మూడుకార్యములు సృష్టి, స్థితి, లయములు మాత్రము గురువునకు లేవు. దేవుని కడకుమనము ఏ విషయమునకై వెళ్ళుదుమో వానిని గురువే మనకొసగగలడు. పరాభక్తి మాత్రము మనకు మన గురువునం దుండవలెను. దేవునియం దెట్టి భక్తినుంచెదమో, అట్టి భక్తియే గురువునందు సహిత ముంచవలెను. గురువు దొరకనప్పుడే దేవుని అవసరము. దైవభక్తికంటె గురుభక్తి గురుతరము. ప్రయోజనకారి. 'దేవుడు గురువుకంటె అధికుడని నేను చెప్పజాలను' అని వేదాంతదేశికులందురు.

''శివే రుష్టే గురు స్త్రాతా గురౌ రుష్టే న కశ్చన''

శివుడు కోపగించుకొన్న గురువు రక్షించును. గురువే కోపగించిన అతనిని రక్షించుటకు ప్రపంచముననే రక్షకుడు లేడు అని అనుట వాడుక. గురువునందు అనన్యభక్తితో ఏ దాపరికము లేక శరణుజొచ్చిన అతడు మనలను దుఃఖముల నుండి రక్షించి మోక్షమునకు గొనిపోవును. ఈశ్వర భక్తికి గురుభక్తి అవసరము. ప్రజలకు గురుభక్తి లేమిచేతనే దైవభక్తి కుదరుటలేదు.

గురువు త్రిమూర్తి స్వరూపము. అతడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అనుదినము చేయు గురుప్రార్థనతో

గురు ర్బ్రహ్మా గురు ర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వరః,

గురు స్సాక్షాత్‌ పరబ్రహ్మ తసై#్మ శ్రీ గురవే నమః||

అందుచే మనము ఈశ్వరభక్తి, గురుభక్తి యుక్తులమై గురువునే దైవముగా గౌరవించి భజింతుముగాక!


Jagathguru Bhodalu Vol-2        Chapters        Last Page